విద్యార్థుల జీవితాలు మార్చేది గురువులే.. మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ: విద్యార్థుల జీవితాలు మార్చేది గురువులేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.

ఉపాధ్యాయులను ఉద్దేశించి మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని, గత సంవత్సరములతో పోలిస్తే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నమోదు శాతం 10 శాతం తగ్గగా, నల్గొండ జిల్లాలో మాత్రం 9% పెరిగిందని, ఇది జిల్లా ఉపాధ్యాయుల పనితీరుకు నిదర్శనమన్నారు.

ప్రభుత్వ పాఠశాలల ద్వారా మెరుగైన విద్యను అందిస్తున్నప్పటికీ చాలామంది విద్యార్థులు ప్రైవేట్‌కు వెళ్తున్నారని, ప్రైవేటు పాఠశాలల్లో బట్టి విధానం, ఇంగ్లీష్ మీడియం వంటివి ప్రభావం చూపిస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో (Government Schools) మంచి ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు ప్రైవేట్ పట్ల మొగ్గు చూపడం పై అందరు ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ల ఏర్పాటు చేస్తున్నామని, నల్గొండలో 200 కోట్ల రూపాయలతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 12,000 మంది టీచర్‌లను కొత్తగా నియమించిందని, అవసరమైతే మరికొంతమందిని నియమిస్తామని, ఉపాధ్యాయులు పిల్లలకు విద్యను అందించడంతోపాటు, వారికి ఆరోగ్యం, జీవిత లక్ష్యాలు నేర్పించాలని మంత్రి సూచించారు. పదవ తరగతి తర్వాత ఇంటర్ విద్యలో ఎక్కువమంది ఫెయిల్ అవుతున్నారని దీనిపై దృష్టి సారించాలని, అలాగే మధ్యలోనే బడి మానేసేవారి వివరాలను సేకరించి అందుకు గల కారణాలను విశ్లేషించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుసింధర్ రావు, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ,కార్పొరేటర్ గుమ్మల జానకి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>