కలం, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో చదువుకుంటూ హైదరాబాద్ (Hyderabad)లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.2.40 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన కోడూరు శ్రీవర్దన్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన దేవరకొండ విద్యశ్రీ పంజాబ్ నేషనల్ కాలేజీలో చదువుకుంటున్నారు. డబ్బులు సరిపోకపోవడంతో డ్రగ్స్ అమ్మాలని నిర్ణయించుకున్నారు.
వీరిద్దరు పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక రూంలో ఉంటూ అమ్మకాలు సాగిస్తున్నారు. వీరిపై కొంతకాలంగా నిఘా పెట్టిన ఎక్సైజ్ పోలీసులు.. పక్కా సమాచారంతో డ్రగ్స్ అమ్ముతుండగా ఉప్పల్ సమీపంలోని సరస్వతీ కాలనీలో పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ కోసం ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

