భైంసాలో ఘనంగా గణేష్​ నిమజ్జనం.. 700 మంది పోలీసులతో బందోబస్తు!

కలం, భైంసా: భైంసా (Bhainsa) పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవ (Ganesh Immersion) వేడుకలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మున్నూరుకాపు సంఘం భవనం, గణేష్‌ నగర్‌, గోపాలకృష్ణ మందిరాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ముధోల్ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ (MLA Pawar Ramarao Patel) ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణేష్‌ నిమజ్జనోత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. నిమజ్జనోత్సవాల నేపథ్యంలో పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జిల్లా ఎస్పీ జానకి షర్మిల బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. 700 మంది పోలీసులు, అదనపు ఎస్పీ, 14 మంది డీఎస్పీలు, 18 మంది సీఐలు, ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షణ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా భైంసాలో గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో ఉత్సవాలను ప్రశాంతంగా ముగించేందుకు ప్రజలు, గణేష్‌ మండపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. నిమజ్జన మార్గాల్లో పోలీసు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. మున్నూరుకాపు సంఘం భవనం వద్ద నిర్వహించిన గణేష్‌ లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లడ్డూను రూ.20,100లకు భక్తులు దక్కించుకున్నారు.

అనంతరం గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన కేంద్రంలో ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ గణనాథుడి నిమజ్జనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా నినాదాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మొల్ల దత్తాత్రి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, గణేష్‌ ఉత్సవ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>