కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేవరకద్ర వర్గం చిన్నచింతకుంట మండలం బండ్రవల్లి (Bandravalli) గ్రామంలో అక్రమంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో 7 ఇసుక టిప్పర్లను తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. ఇసుక రవాణాకు సరైన అనుమతులు ఉన్నాయా? అంటూ రైతులు టిప్పర్ల యజమానులను నిలిపివేశారు.
సమాచారం తెలుసుకున్న చిన్నచింతకుంట మండల బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని రైతులకు అండగా నిలిచారు. గత మూడు నెలలుగా మండలంలో ఇసుక రవాణాపై అనుమానాలు, ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు.
రాజకీయ అండపై బీఆర్ఎస్ ఆరోపణలు
రాత్రివేళల్లో జరుగుతున్న రవాణాపై అధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని నిలదీశారు. ఇసుక అక్రమ రవాణా (Illegal Sand Transportation) వెనుక రాజకీయ అండ ఉందంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తాము ఆరోపిస్తున్న షాడో ఎమ్మెల్యే తమ్ముడు పాత్రపైనా సమగ్ర విచారణ చేయాలని కోరారు.
పర్మిట్లు, ఇసుక పరిమాణంపై విచారణకు డిమాండ్
బండ్రవల్లి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి.. 7 టిప్పర్ల పర్మిట్లు, ట్రాన్సిట్ పాస్లు, ఇసుక పరిమాణం, రవాణా సమయం, గమ్యస్థానం వివరాలను బయటపెట్టాలని (BRS Leaders) డిమాండ్ చేశారు. అక్రమ రవాణా నిజమని తేలితే వాహనాలను సీజ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి, అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చిన్నచింతకుంట మండల బీఆర్ఎస్ నాయకత్వం వెల్లడించింది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని.. రైతులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

