కలం, యాదగిరిగుట్ట: ఒడిశా నుంచి గోవాకు భారీగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీల్లో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.24 లక్షల విలువైన గంజాయి, కారు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని యంనంపేట(Yamnampet) పద్మనాభస్వామి ఆలయం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన మారుతి బలెనో కారును ఆపి తనిఖీ చేయగా 22 కిలోల గంజాయి బయటపడింది.
దీంతో కారులో ఉన్న ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్ గౌడ, అవినాష్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 22 కిలోల గంజాయితో పాటు గంజాయి రవాణాకు ఉపయోగించిన బలెనో కారు (GA07 H 3746), రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.24 లక్షలు ఉంటుందని ఎస్ఓటీ అధికారులు తెలిపారు. విచారణలో నిందితులు ఒడిశా నుంచి గోవాకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ కోసం పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

