ఆదివాసీల ఆగ్రహం.. భద్రాచలంలో 5 వేల మందితో ఐటీడీఏ ముట్టడి

కలం, ఖమ్మం బ్యూరో: ఆదివాసీల హక్కుల రక్షణ, పోడు భూముల పరిష్కారం, ఉద్యోగాలు, అనర్హులను ఎస్టీ జాబితా నుంచి తక్షణమే తొలగించాలని ‘తుడుందెబ్బ’  (Tudum Debba) డిమాండ్ చేసింది. సోమవారం నిర్వహించిన ఆందోళనతో ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మైపా అరుణ్ కుమార్ నేతృత్వంలో సోమవారం చేపట్టిన భద్రాచలం ఐటీడీఏ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ​స్థానిక బ్రిడ్జి సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ భారీ ఆందోళన కార్యక్రమానికి ఏజెన్సీ మూలమూలల నుంచి సుమారు 5,000 మందికి పైగా ఆదివాసీలు తరలివచ్చారు. సాంప్రదాయ వాయిద్యాల మోత, నినాదాల హోరు నడుమ బ్రిడ్జి సెంటర్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ ర్యాలీతో భద్రాచలం వీధులు మారుమోగాయి.

​ఈ సందర్భంగా తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులు కాలరాస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని మండిపడ్డారు. అర్హత లేకుండా అక్రమంగా ఎస్టీ జాబితాలో చేరి లబ్ధి పొందుతున్న అనర్హులను తక్షణమే తొలగించాలని, తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను స్థానిక గిరిజన యువతతోనే భర్తీ చేయాలని స్పష్టం చేశారు.

​కాగా, వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలను అడ్డుకునేందుకు పోలీసులు ఐటీడీఏ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా బందోబస్తు నిర్వహించారు. ఆందోళనకారులు బారికేడ్లను తోసుకుంటూ ఐటీడీఏ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని తుడుందెబ్బ నాయకులు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>