కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిషేధిత భూముల (22ఏ) జాబితా వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ధరణి (Dharani) స్థానంలో కొత్తగా భూ భారతి (Bhu Bharati) పోర్టల్‌ను తీసుకొస్తున్న తరుణంలో ప్రైవేట్ పట్టా భూములు, ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున 22ఏ జాబితాలో చేరిపోవడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. ఈ పరిణామాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసింది.
కొత్త పోర్టల్‌కు మార్పు ప్రక్రియలో ఎలాంటి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, కనీసం ముందస్తు సమాచారం లేదా నోటీసులు కూడా జారీ చేయకుండా వేలాది ఆస్తులను నిలిపివేయడంపై న్యాయవాది కరుపోతుల రేవంత్ ఎన్‌హెచ్ఆర్‌సీని ఆశ్రయించారు. ఈ ఏకపక్ష చర్యల వల్ల ఆస్తుల క్రయవిక్రయాలు, బ్యాంక్ లోన్లు, తనఖా లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీని వల్ల లక్షలాది మంది సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల ఈ ధోరణి పరోక్షంగా అవినీతికి, మధ్యవర్తుల జోక్యానికి తావిస్తోందని ఆయన ఫిర్యాదులో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పరిగణించిన మానవ హక్కుల కమిషన్ దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రైవేట్ ఆస్తుల నిలుపుదలపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను రాబోయే నాలుగు వారాల్లోగా తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్‌హెచ్ఆర్‌సీ (NHRC) ఆదేశించింది.
Also Read : మద్దతు లేదు, బరువు తగ్గలేదు: వరుణ్ సన్యాళ్
Follow Us On : WhatsApp

