కలం, మక్తల్: భారత దేశ ఖ్యాతిని, సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. ఆయన జీవితాన్ని నేటితరం యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎంపీ డీకే అరుణతో కలిసి మక్తల్ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివేకానంద 150 ఏళ్ల క్రితమే ప్రపంచ దేశాల్లో పర్యటించి భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు.
విద్యార్థులకు బహుమతులు..
స్వామి వివేకానంద మహనీయుడి విగ్రహం మక్తల్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఇటీవల పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన ఉపన్యాస, వ్యాస రచన పోటీలు, ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సిద్ది లింగేశ్వర స్వామి, ఆదిత్య పరా శ్రీ స్వామి, మాజీ ఎంపీపీ బి.కొండయ్య, మున్సిపల్ ఛైర్పర్సన్ వాకిటి మానస, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ గవినోళ్ల రాధా లక్ష్మారెడ్డి, నాయకులు బలరాం రెడ్డి, నరసింహా గౌడ్, అంజిరెడ్డి, మాచర్ల రాంబాబు, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

