కలం, వెబ్డెస్క్: ఏపీలో మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరారు. డీఎస్సీ ప్రక్రియలో ఎలాంటి తప్పు జరగలేదంటూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే ఈ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో సీబీఐ విచారణ కోరుతూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ నాయకులపై ప్రభుత్వం లాఠీచార్జ్ చేయించడం, అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు.
లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ వ్యవహారంలో నిష్పాక్షిక విచారణ జరిపితేనే నిరుద్యోగులకు ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకం కుదురుతుందని జగన్ స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టి, అరెస్టులతో ప్రతిపక్ష గొంతును అణిచివేసి అక్రమాలను దాచలేరని హెచ్చరించారు. డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

