సర్వే నం. 206పై రైతుల పోరాటం.. భూ హక్కులు పునరుద్ధరించాలని డిమాండ్!

కలం, దేవరకొండ: చందంపేట (Chandampet) మండలం చిత్రియాల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 206 (Survey No. 206) లో పునరావాసం కింద భూములు పొందిన రైతులకు తక్షణమే అన్ని రకాల భూ హక్కుల (Land Rights) ను పునరుద్ధరించాలని ప్రజా పోరాట సమితి (పీఆర్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు చిత్రియాల, పెదమూల, నల్ల శిలమూల గ్రామాలకు చెందిన బాధితులైన రైతులతో కలిసి ఆయన చందంపేట తహశీల్దార్ టి. సత్యనారాయణ గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రం అందజేసిన అనంతరం నూనె వెంకట్ స్వామి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల ముంపునకు గురైన వివిధ గ్రామాల బాధితులకు 1972 లో సర్వే నంబర్ 206 లోని 9,600 ఎకరాల అటవీ భూమిలో 2,061 ఎకరాల 28 గుంటల భూమిని రెవెన్యూ భూమిగా మార్చారని తెలిపారు. ఇందులో 1,240 ఎకరాల 29 గుంటల భూమిని రైతులకు పట్టాలుగా పంపిణీ చేయగా.. నాటి నుండి నేటి వరకు ఆ భూముల్లో వారే వ్యవసాయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

2018 లో గత ప్రభుత్వ హయాంలో మిగిలిన 7,600 ఎకరాల భూమిలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నలుగురు తహవీల్దారులు, కొందరు వీఆర్వోలు కుమ్మక్కై స్థానికేతరులకు దొంగ పట్టాలు సృష్టించారని, ఈ కుంభకోణంపై అప్పట్లో విచారణ జరిపి సదరు తహవీల్దారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు గుర్తుచేశారు. “ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు” అధికారులు చేసిన అక్రమాల కారణంగా సర్వే నంబర్ 206 మొత్తాన్ని రెవెన్యూ రికార్డుల్లో లాక్ చేయడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల 1972 లోనే చట్టబద్ధంగా పట్టాలు పొంది సాగు చేసుకుంటున్న అసలైన బాధితుల హక్కులు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.

ఈ సర్వే నంబర్ పూర్తిస్థాయిలో లాక్ కావడం వల్ల నిజమైన రైతులకు భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయని, మ్యూటేషన్లు కాక సమస్యలు పేరుకుపోయాయని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి, విచారణ జరిపి నిజమైన పునరావాస రైతుల భూ హక్కులను కాపాడాలని, లాకింగ్ సమస్య నుంచి విముక్తి కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చిత్రియాల, పెదమూల, నల్ల శిలమూల గ్రామాల బాధితులైన రైతాంగం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>