కలం, మహబూబాబాద్: పోలీసులమంటూ బంగారం వ్యాపారులను ఫోన్‌లో బెదిరించి ‘డిజిటల్ అరెస్ట్’ (Digital Arrest) పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠాను మహబూబాబాద్ జిల్లా కేసముద్రం (Kesamudram) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన షేక్ ఇర్ఫాన్ (29), చింతలచేరువు ప్రశాంత్ (26)లను అరెస్ట్ చేశారు. వారి నుంచి పోలీస్ యూనిఫాం, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ యూనిఫాంతో నమ్మించే ప్రయత్నం
ఇర్ఫాన్ పోలీస్ యూనిఫాం ధరించి ఫొటో తీసుకుని వాట్సాప్, ట్రూ కాలర్‌లో డీపీగా పెట్టుకున్నాడు. అనంతరం కేసముద్రం మండలానికి చెందిన బంగారం వ్యాపారి బోగోజు వేణుగోపాల చారి నంబర్‌ను గూగుల్ ద్వారా సేకరించి ఫోన్ చేశాడు. తాను వికారాబాద్ సమీపంలోని పార్వతీపురం పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐని అంటూ పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు దొంగలను పట్టుకున్నామని, వారు దొంగిలించిన బంగారాన్ని వ్యాపారి కొనుగోలు చేశాడంటూ బెదిరించాడు. అరెస్ట్ చేస్తామని భయపెట్టి వాట్సాప్‌లో క్యూఆర్ కోడ్ పంపించి రూ.88,026 వసూలు చేశాడు.
రెండు రాష్ట్రాల్లో బంగారం వ్యాపారులే టార్గెట్
దర్యాప్తులో నిందితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బంగారు వ్యాపారులను ఇదే తరహాలో లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. ఇలా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు సుమారు రూ.4.20 లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2024–25లోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు, నల్గొండ ఒకటో టౌన్, ఆదిలాబాద్ ఒకటో టౌన్ , ఎచ్చోడ, కట్టంగూర్, తిరుమలగిరి, రామగూడెం, బిక్కవోలు పోలీస్‌స్టేషన్లలో వీరిపై కేసులు ఉన్నట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలు, సైబర్ క్రైమ్ పోర్టల్ వివరాలు, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించి నిందితులను గుర్తించినట్లు ఎస్పీ డా. శబరీష్ తెలిపారు. పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు, అనుమానాస్పద క్యూఆర్ కోడ్‌లు, ఆన్‌లైన్ డబ్బు డిమాండ్లకు స్పందించవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని తెలిపారు.

