కలం, నిర్మల్ రూరల్ : నిర్మల్ రూరల్ (Nirmal Accident) మండలం మేడిపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఓ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.
రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న టీఎస్ 07 యూజీ 8389 లారీ మేడిపల్లి గ్రామ శివారులో టైరు పంక్చర్ కావడంతో రహదారి పక్కన నిలిపారు. డ్రైవర్ వెనుక భాగంలో నిలబడి ఉండగా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్జే 11 జీడీ 5457 నంబర్ గల మరో లారీ ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లారీ వెనుక నిలబడి ఉన్న రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్ ఉరుపాల్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక నుంచి ఢీకొట్టిన లారీలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

