కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గణేష్ నిమజ్జన (Ganesh Immersion) కార్యక్రమాల్లో ప్రజలు, మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) సూచించారు. నిమజ్జనానికి విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ తీగలు, హైటెన్షన్ వైర్ల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విగ్రహాలను తరలించే ముందు మార్గాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలని, విద్యుత్ తీగలకు విగ్రహాలు తగలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వర్షాల కారణంగా రహదారులు, విద్యుత్ తీగల పరిసరాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, అందువల్ల మండపాల నిర్వాహకులు, యువత మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. నిర్మల్ పట్టణంలో నిమజ్జనానికి విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో హైటెన్షన్ విద్యుత్ వైర్ తగిలి ఒక వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.

