కలం, కరీంనగర్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలతో ‘కల్పిత నాయకుడు అంబేద్కర్’ అనే పుస్తకాన్ని రాసిన రచయిత హమారా ప్రసాద్ (Hamara Prasad)ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ జనతా పార్టీ (TJP) రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కుతాడి శివరాజ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ వర్ధంతి, జయంతుల వేళ సమాజంలో గందరగోళం సృష్టించడానికి, చిల్లర వ్యాఖ్యలతో రాసిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ పుస్తక రచయిత హమారా ప్రసాద్‌ను అరెస్టు చేసి జైలుకు పంపాలని పేర్కొన్నారు. ‘కల్పిత నాయకుడు అంబేద్కర్’ పుస్తకాన్ని తక్షణమే రద్దు చేసి, మార్కెట్ నుండి ఉపసంహరించుకోవాలని అన్నారు.
హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. హమారా ప్రసాద్ వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులు, దుర్మార్గులపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

