యాదగిరిగుట్ట సమస్యలపై అసెంబ్లీలో బీర్ల డిమాండ్స్

కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి యాదాద్రి ఆలయ ఆదాయంలో వాటా కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(MLA Beerla Ilaiah) ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలకు తగిన స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మున్సిపాలిటీలకు స్వంత ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ ప్రజలకు మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర సేవలను అందిస్తున్నాయని బీర్ల అయిలయ్య తెలిపారు. యాదగిరిగుట్టకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని, ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన అనేక సేవలను మున్సిపాలిటీ అందిస్తోందని పేర్కొన్నారు.

గతంలో యాదగిరిగుట్ట గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో ఆలయ ఆదాయంలో 30 శాతం వరకు పంచాయతీకి కేటాయించేవారని, ప్రస్తుతం మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆ విధమైన ఆదాయ వాటా అందడం లేదని తెలిపారు. మున్సిపాలిటీకి స్వంత ఆదాయం పరిమితంగా ఉన్నందున ఆలయ ఆదాయం నుంచి నిధులు కేటాయించి యాదగిరిగుట్ట అభివృద్ధికి సహకరించాలని కోరారు. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం చేపట్టిన భూసేకరణలో ఇళ్లు, షాపులు, భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సైదాపూర్‌లోని 329, 314 సర్వే నంబర్ల పరిధిలో అర్హులైన వారికి పట్టాలు అందించాలని కోరారు. గతంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.అదేవిధంగా యాదగిరిగుట్ట అభివృద్ధి పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మాణంతో సుమారు 200 మంది వ్యాపారుల జీవనోపాధిపై ప్రభావం పడిందని బీర్ల అయిలయ్య తెలిపారు. షాపులు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, బాధితుల జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యాదగిరిగుట్టను సందర్శించిన సందర్భంగా బ్రిడ్జి తొలగింపుపై బాధితుల సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.

ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అని, ప్రభుత్వం ఈ డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని బీర్ల అయిలయ్య తెలిపారు.  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలేరు నియోజకవర్గం ముందంజలో ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి ప్రజల చిరకాల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.  ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయానికి రోజుకు సుమారు లక్ష మంది భక్తులు వస్తున్నందున మున్సిపాలిటీకి తగిన నిధులు కేటాయించాలని కోరారు. సుమారు 200 మంది వ్యాపారులకు ఇబ్బందికరంగా ఉన్న బ్రిడ్జిని తొలగించే అంశాన్ని పరిశీలించాలని, ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>