కలం, సత్తుపల్లి: మహాజన సోషలిస్ట్ పార్టీ (ఎంఎస్పీ) సత్తుపల్లి (Sathupalli) మండల కమిటీ నూతన సారథిగా గద్దల దేవయ్య మాదిగ (అలియాస్ గద్దల వెంకటేశ్వరరావు) ఎన్నికయ్యారు. సత్తుపల్లిలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయనను మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు బాధ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా గద్దల దేవయ్య మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ ఆశయాలకు అనుగుణంగా సంపూర్ణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎంఎస్పీని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడానికి తన వంతుగా శ్రమిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా మాజీ అధ్యక్షుడు తురుగంటి అంజయ్య మాదిగ, జిల్లా మాజీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగలు మాట్లాడుతూ.. నూతన అధ్యక్షుడి నాయకత్వంలో సత్తుపల్లి మండలంలో పార్టీ మరింత పుంజుకోవాలన్నారు. బహుజన రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

