ఎల్ నినో ఎఫెక్ట్.. వరి సాగు డౌన్

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎల్‌ నినో పరిస్థితులు, ప్రభుత్వ సూచనల ప్రభావంతో ఈ ఖరీఫ్‌ సీజన్లో (Telangana Kharif) వరిసాగు విస్తీర్ణం దాదాపు పది లక్షల ఎకరాలు తగ్గగా, పత్తి సాగు పెరిగింది. వ్యవసాయ శాఖ తొలుత వేసుకున్న అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 65.95 లక్షల ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉండగా.. గతేడాది ఇదే సమయానికి (సెప్టెంబరు 16) 66.74 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి మాత్రం 55.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ఖరీఫ్లో 47.41 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాల్సి ఉండగా.. గతేడాది ఇదే సమయానికి 45.82 లక్షల ఎకరాల్లో సాగైంది.

ఈసారి మాత్రం 48.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది. వరి, పత్తితో పాటు పప్పు దినుసులు, మిల్లెట్లు, నూనెగింజలు తదితర అన్ని రకాల పంటలు కలిపి ఈ సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా.. గతేడాది ఇదే సమయానికి 1.32 కోట్ల ఎకరాల్లో సాగైంది. ఈసారి మాత్రం సాగు విస్తీర్ణం 1.25 కోట్ల ఎకరాల వద్దే ఉంది. మరో వారం రోజుల్లో వరి నాట్లతోపాటు ఇతర పంటల సాగు గడువు ముగియనుంది. మరో రెండు వారాల తర్వాత మొత్తం పంటల సాగు లెక్కలు స్పష్టంగా తేలనున్నాయి.

ఈ రెండు జిల్లాల్లోనే వరి ఎక్కువ

కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో ఈసారి వరిసాగు తగ్గింది. నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబ్నగర్, నారాయణపేట తదితర జిల్లాల్లో తగ్గుదల గణనీయంగా ఉంది. నల్లగొండ జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 5.38 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈసారి 3.60 లక్షల ఎకరాలకే పరిమితమైంది.

సూర్యాపేటలో గతేడాది 4.66 లక్షల ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి 3.45 లక్షల ఎకరాల్లోనే సాగైంది. కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం గతేడాదితో పోలిస్తే స్వల్పంగా, సుమారు 10 వేల ఎకరాల మేర వరి సాగు పెరిగింది. అన్ని రకాల పంటల సాగును పరిగణనలోకి తీసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, భూపాలపల్లి, కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో అంచనాలకు అనుగుణంగా సాగు జరుగుతున్నది. మిగిలిన జిల్లాల్లో సగటున 15 శాతం మేర సాగు విస్తీర్ణం తగ్గింది.

వరికి బదులు పత్తికి మొగ్గు

ఎల్‌ నినో పరిస్థితుల నేపథ్యంలో వరి సాగును తగ్గించి ఆరుతడి పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ సూచించడంతో చాలా జిల్లాల్లో దాని ప్రభావం కనిపించింది. రాష్ట్రంలో అత్యధికంగా వరి సాగయ్యే నల్లగొండ జిల్లాలోనూ ఈసారి రైతులు ప్రత్యామ్నాయంగా పత్తివైపు మళ్లారు. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం నల్లగొండలో 6.09 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాల్సి ఉండగా.. ఈసారి ఇప్పటికే 5.93 లక్షల ఎకరాలు దాటింది.

గతేడాది ఇదే సమయానికి 5.68 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగైంది. సూర్యాపేట, భువనగిరి, వరంగల్, జనగామ, ఖమ్మం, కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ పత్తి సాగు అంచనాలను మించి సాగుతున్నది. ఆసిఫాబాద్లో గతేడాది 3.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈసారి 3.77 లక్షల ఎకరాలకు పెరిగింది.

నిర్మల్ లో 1.40 లక్షల నుంచి 1.64 లక్షల ఎకరాలకు, రంగారెడ్డిలో 1.38 లక్షల నుంచి 1.64 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తంగా గతేడాది 45.83 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా.. ఈసారి 48.33 లక్షల ఎకరాలకు పెరిగింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులుగా రైతులు పత్తిని ఎంచుకున్నట్లు సాగు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>