కలం, జోగులాంబ గద్వాల: వర్షాభావ పరిస్థితులు, సాగు నీటి కొరతతో జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల (Itikyal) మండలంలో పంటలు ఎండిపోతున్నాయి. కాపు దశలో ఉన్న పంటలకు నీరు అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాలువల్లో నీరు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతుండగా.. సరిపడా విద్యుత్ సరఫరా లేక బోర్లపై ఆధారపడిన పంటలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం ముందుగానే హెచ్చరించింది. అయితే జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. కాలువలకు సాగు నీరు ఆలస్యంగా విడుదల కావడంతో పలువురు రైతులు వరి నాట్లు ఎక్కువగా వేసుకున్నారు.
పూర్తి స్థాయిలో అందని సాగు నీరు..
జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గద్వాల, ఇటిక్యాల మండలాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. కుడి కాలువ గద్వాల మండలం అనంతపురం, బస్రా చెరువు గ్రామాల మీదుగా ప్రవహించి ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని జింకలపల్లి శివారులోని ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటర్-31 వద్ద కలుస్తుంది. అయితే, జూరాల కుడి కాలువ ద్వారా విడుదలైన నీరు గద్వాల మండలంలోని పలు గ్రామాల వరకు చేరినా.. ఇటిక్యాల మండలంలోని ఆర్డీఎస్ లింక్ కెనాల్ డి-31 నుంచి డి-40 వరకు పూర్తి స్థాయిలో నీరు అందలేదని రైతులు చెబుతున్నారు.
వరద తగ్గిపోవడంతో..
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో కుడి కాలువకు సాగునీటి విడుదలను నిలిపివేశారు. దీంతో ఆర్డీఎస్ లింక్ కాలువలపై ఆధారపడిన పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో డి-31 నుంచి డి-40 వరకు ఉన్న ఆర్డీఎస్ లింక్ కెనాల్స్ ద్వారా సుమారు 24 వేల ఎకరాలకు సాగునీరు అందేది. ఈ నీటితో రైతులు వరి, వేరుశనగతో పాటు వివిధ పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీటి విడుదల లేకపోవడంతో ఆయకట్టు పంటలు ప్రమాదంలో పడ్డాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ వద్దకు ఎమ్మెల్యే, రైతులు..
ఎర్రవల్లి మండలం షేక్‌పల్లి, దువాస్‌పల్లి, బీవీరాపురం, షాబాద్, శాసనూల్, కారుపాకల తదితర గ్రామాలకు చెందిన రైతులు గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా, ఇరిగేషన్ శాఖ అధికారులను కలిశారు. లింక్ కెనాల్‌కు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదని వివరించారు. పంటలు కాపు దశలో ఉన్నందున మరికొన్ని రోజులు వారబందీ పద్ధతిలోనైనా కాలువలకు నీటిని విడుదల చేయాలని కోరారు.
కృష్ణా నది పక్కనే ఉన్నా..
ఎర్రవల్లి మండలం దువాస్పల్లికి చెందిన కుర్వ సత్యన్న నాలుగు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ, వరి పంటలు సాగు చేశారు. కృష్ణా నది సమీపంలో ఉన్నా తమ వ్యవసాయ భూములకు సాగు నీరు అందకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల కుడి కాలువకు అనుసంధానమైన ఆర్డీఎస్ లింక్ కెనాల్ డి-34 ద్వారా షేక్‌పల్లి, శాసనూల్, దువాస్‌పల్లి, వీరాపురం గ్రామాలకు నీరు అందాల్సి ఉందన్నారు. అర్డీఎస్ లింక్ కెనాలకు సాగునీరు నిలిపివేయడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు.
పెట్టుబడులు మిగిలేనా?
కుడి కాలువ నీరు గద్వాల మండలంలోని రైతులకు అందుతున్నా ఇటిక్యాల మండలంలోని ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువల ద్వారా నీరు రాకపోవడంతో బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని, అయితే సరిపడ విద్యుత్ సరఫరా లేక ఆ పంటలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నీరు, విద్యుత్ అందకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి పశువులకు మేతగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి మరికొన్ని రోజులు కాలువలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు సైతం తిరిగి వచ్చే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

