కలం, కరీంనగర్: విరాట్ విశ్వకర్మ భగవానుడి ఆరాధనతో కరీంనగర్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కులబంధువులు, నాయకులు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ పురోహితులు కొత్తపెల్లి బ్రహ్మచారి ఆధ్వర్యంలో యజ్ఞం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి, యజ్ఞాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. విశ్వకర్మ భగవానుడు సృష్టికర్తగా పూజలందుకుంటున్నారని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర విశిష్టమైనదని అన్నారు. వడ్రంగం, కమ్మరం, కంచరం, శిల్పం, స్వర్ణకార వృత్తుల ద్వారా తరతరాలుగా సమాజానికి సేవలందిస్తున్న విశ్వబ్రాహ్మణుల వృత్తి నైపుణ్యాలను కొనియాడారు. ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో స్వామి, డీడీ బీసీడబ్ల్యూ అనిల్ ప్రకాష్ డీడబ్ల్యూఓ సరస్వతి, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, విశ్వబ్రాహ్మణ నాయకులు రామోజు రవీంద్ర చారి, చెల్లోజు రాజు, శ్రీమంతుల సదాశివం, తిప్పారపు శ్రీనివాస్, గాలిపెల్లి శంకరయ్య, నాంపల్లి శ్రీనివాస్, మియాపురం రవీంద్ర చారి, కాయితోజు బ్రహ్మచారి, కట్ట జగన్, శ్రీధర్ రాజు, శ్రీరామోజు భగవాన్, గోగులకొండ శ్రీనివాస్, తోమిటి సదానందం, కడార్ల శివప్రసాద్, కట్ట జగన్, కనపర్తి దివాకర్, కడార్ల చంద్రశేఖర్, సామనపల్లి లక్ష్మీ శంకరాచారి, గోగులకొండ రాజు తదితరులు పాల్గొన్నారు.

