ప్రపంచ బ్యాంకు నిధులతో వరంగల్‌ అభివృద్ధి

కలం, హనుమకొండ: వరంగల్‌ (Warangal) నగర అభివృద్ధికి నిధులు అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. రాష్ట్రంలోని పట్టణాలభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన 300 మిలియన్‌ డాలర్ల రుణానికి ప్రపంచ బ్యాంకు ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రతినిధుల బృందం గురువారం వరంగల్‌ నగరంలో పర్యటించింది.

ఈ సందర్భంగా హనుమకొండలోని కుడా కార్యాలయంలో ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కుడా ఛైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, కలెక్టర్లు చాహత్‌ బాజ్‌పాయి, డాక్టర్‌ సత్యశారద, కార్పొరేషన్ కమిషనర్‌ తేజావత్‌ వెంకన్న తదితరులతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సమావేశమయ్యారు. నగరంలో చేపట్టనున్న అభివృద్ధి ప్రాజెక్టులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు.

టెండర్లు పూర్తయిన వాటికి..

వరంగల్ నగరంలో ప్రధానంగా అశోక జంక్షన్‌, భద్రకాళి ఆలయం వద్ద మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌, సెంట్రల్‌ ప్లాజా పునర్నిర్మాణం, రోప్‌వే, సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌, సమగ్ర స్టార్మ్‌వాటర్‌ డ్రైనేజీ వ్యవస్థ తదితర ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధమై, టెండర్లు పూర్తయిన ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. స్టార్మ్‌ వాటర్‌ డ్రైనేజీ డీపీఆర్‌ ఇప్పటికే సిద్ధంగా ఉన్నందున ఈ ప్రాజెక్టుకు తొలి దశలోనే రుణ సహాయానికి ప్రతిపాదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మిగతా ప్రాజెక్టుల డీపీఆర్‌లను త్వరితగతిన సిద్ధం చేసి తదుపరి దశలో సమర్పించనున్నారు. మొత్తం ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 70 శాతం ప్రపంచ బ్యాంకు, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉండేలా ప్రతిపాదన రూపొందించారు. వరంగల్‌ చారిత్రక, వారసత్వ నగరం కావడంతో హెరిటేజ్‌, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ బ్యాంకు బృందం అధికారులకు సూచించింది. చారిత్రక ప్రాంతాల పరిరక్షణతో పాటు పర్యాటక, రవాణా, డ్రైనేజీ, మౌలిక వసతులు, పట్టణ సుందరీకరణను సమగ్రంగా అభివృద్ధి చేసేలా ప్రాజెక్టులు రూపొందించాలని పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>