కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర భూముల (KCR Farmhouse Lands)పై రెవెన్యూ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో స్థానిక మార్కూక్ తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూముల రికార్డులు, ఫైళ్లను బయటకు తీసి పరిశీలిస్తున్నారు. ఫామ్‌హౌస్ పరిసరాల్లో దాదాపు 385 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని.. ఇవి కేసీఆర్ కుటుంబం ఆధీనంలో భూములు ఉన్నాయంటూ సీఎం రేవంత్ శాసనసభలో ప్రకటన చేశారు.
ఈ భూములపై పూర్తిస్థాయి స్పష్టత సాధించేందుకు, కేసీఆర్ కొనుగోలు చేసిన భూముల విస్తీర్ణం ఎంత? ప్రస్తుతం అక్కడ ఉన్న భూమి ఎంత? అనే అంశాలపై విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో భూముల వివరాలు సేకరిస్తున్న అధికారులు మాజీ సీఎం కేసీఆర్‌కు త్వరలోనే అధికారిక నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
క్షేత్ర స్థాయిలో అధికారుల పరిశీలన..
మర్కూక్ మండలంలో అసైన్డ్ భూముల వ్యవహారంపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా మండల రెవెన్యూ కార్యాలయాన్ని మంగళవారం ఆర్‌డీవో చంద్రకళ (RDO Chandrakala) సందర్శించి, సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. మండల పరిధిలోని దాదాపు 385 ఎకరాల అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
ఈ మేరకు మర్కూక్ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీవో చంద్రకళ, సర్వేయర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలోని భూముల (KCR Farmhouse Lands) సర్వే నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిబంధనల ప్రకారం ముందస్తుగా నోటీసులు జారీ చేసిన అనంతరమే క్షేత్రస్థాయిలో సర్వే ప్రక్రియ చేపట్టాలని ఆర్‌డీవో ఆదేశించినట్టు సమాచారం.
అనంతరం జిల్లా సర్వే అధికారి, ఆర్‌డీవో చంద్రకళ, ఎంఆర్‌వో సరితలు కలిసి క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన జరిపారు. సర్వే ప్రక్రియను పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయాలని సర్వేయర్లను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అధికారుల కసరత్తు వేగవంతం కావడంతో ఏ క్షణంలోనైనా నోటీసులు అందజేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తనిఖీల్లో ఆ భూములు ప్రభుత్వానివిగా తేలితే వాటిని స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
Also Read : ఫామ్‌హౌస్ భూములపై విచారణ.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు
Follow Us On: Instagram

