కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం, మార్గం మధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది (Mogili Ghat Accident). ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులోని వేపనపల్లికి చెందిన ఆరుగురు వ్యక్తులు బొలెరో వాహనంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

