వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. ఆరుగురు పిల్లలు మృతి

కలం, మెదక్ బ్యూరో: వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. శివ నగర్ శిరీష ఛారిటబుల్ ట్రస్ట్‌లో చదువుకుంటున్న తొమ్మిది మంది విద్యార్థులు గణేశుడి విగ్రహాన్ని ఎత్తుకొని నిమజ్జనం చేయడానికి నేరేడు చెరువులోకి దిగారు. చెరువులో లోతైన గుంతలు ఉండటం, విగ్రహం బరువు ఎక్కువ కావడంతో పాటు విద్యార్థులకు ఈత రాకపోవడంతో ఒక్కసారిగా లోతుల్లోకి జారిపోయారు. దీంతో ఆరు మంది విద్యార్థులు నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు నర్సింహా రాజు: (బీటెక్),  సుమంత్: (డిప్లమా 2nd ఇయర్), గణేష్: డిప్లమా (2nd ఇయర్), ఉదయ్ కిరణ్: (డిప్లమా 3rd ఇయర్), శాముకుమార్ (డిప్లమా 1st ఇయర్), సిద్ధార్థ్( 10వ తరగతి) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పఠాన్ చెరు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జిన్నారం మండలం శివనగర్-పెద్దకంచెర్ల చౌరస్తాలోని శిరీష చారిటబుల్ ట్రస్ట్ లో 70 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఒకటవ తరగతి నుండి పాలిటెక్నిక్, బీటెక్ వరకు తల్లిదండ్రులు లేని విద్యార్థులు మాత్రమే ట్రస్టులో చేర్చుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కృష్ణంరాజు అనే వ్యక్తి.. తన కుమార్తె శిరీష పేరు మీద ట్రస్ట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే దిగ్భ్రాంతి..

విద్యార్థుల మృతి పట్ల పఠాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాచీన గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల మృతదేహాలకు నివాళి అర్పించారు. గురువారం ఉదయం 10 గంటల లోపు పోస్టుమార్టం పూర్తి చేయాలని.. తదనంతరం వారి వారి సొంత స్థలాలకు అంబులెన్స్ లో తరలించాలని అధికారులను ఆదేశించారు. సొంత నిధులతో అంబులెన్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఒకేసారి ఆరుగురు విద్యార్థులు చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Also Read : రోహిత్ రికార్డు బద్దలు.. టాప్‌లోకి బట్లర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>