కలం, కరీంనగర్: కరీంనగర్(Karimnagar) నగర పాలక సంస్థలోని డి.బి. సెక్షన్ అధికారులు నిర్వహిస్తున్న టెండర్ల ప్రక్రియ తరచూ వివాదాస్పదంగా మారుతోందని తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) ఆరోపించారు. బుధవారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నగర అభివృద్ధిలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తున్నామని ప్రజాప్రతినిధులు చెబుతున్నప్పటికీ ఇంజనీరింగ్ అధికారుల వ్యవహారశైలి అందుకు భిన్నంగా ఉందన్నారు.
నగరంలో అనేక మంది రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు ఉన్నప్పటికీ, కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగేలా నిబంధనలు విధించడం వల్ల స్థానిక కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనలేకపోతున్నారని ఆయన (Gunjapadugu Hariprasad) ఆరోపించారు. ఇటీవల పిలిచిన వాటర్ పైప్‌లైన్ టెండర్లలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకుండా కొన్ని పైపుల తయారీ సంస్థలకే అర్హత కల్పించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
గతంలో రూ.45 లక్షల విలువైన ఇదే తరహా పైప్‌లైన్ టెండర్‌ను తయారీదారుల నిబంధన లేకుండా నిర్వహించగా, దాదాపు 28 శాతం తక్కువకు టెండర్ ఖరారై కార్పొరేషన్‌కు సుమారు రూ.12 లక్షల లాభం వచ్చిందని హరిప్రసాద్ తెలిపారు. ఇప్పుడు నిబంధనలు మార్చడం వల్ల పోటీ తగ్గి కార్పొరేషన్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. టెండర్ నిబంధనల మార్పుపై మేయర్, కమిషనర్ తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
వివాదాస్పద టెండర్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, గతంలో మాదిరిగా ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పాల్గొనేలా టెండర్లు నిర్వహించాలని కోరారు. అధికారులు స్పందించకపోతే ఉన్నతాధికారులు, విజిలెన్స్ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన నగర అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, జిల్లా సీనియర్ నాయకులు కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)

