కలం, ముధోల్: విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్య అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) సూచించారు. ముధోల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) మంగళవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం అన్ని పూటలా నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. వసతి విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని తరగతుల సిలబస్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా బోధన కొనసాగించాలని సూచించారు.
అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, ప్రతిరోజూ అందిస్తున్న భోజనం, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గణితం సబ్జెక్టుకు సంబంధించిన పలు లెక్కలను విద్యార్థులతో బోర్డుపై చేయించారు. లెక్కలను సరిగ్గా చేసిన విద్యార్థులను అభినందించి, వారికి పెన్నులను బహుమతులుగా అందజేశారు. ఈ తనిఖీలో డీఈవో భోజన్న, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

