అసెంబ్లీ ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు.. ఢిల్లీకి వెళ్తామని కేటీఆర్ వార్నింగ్

కలం, వెబ్​ డెస్క్ : అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో కేటీఆర్ (KTR) మాట్లాడుతూ..  మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరు, తమపై జరిగిన దాడి, అనంతరం తమపైనే కేసులు నమోదు చేసిన అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

పోలీసుల దాడికి సంబంధించిన ఆధారాలు అందజేత

నల్ల టీషర్టులు ధరించి నిరసన తెలిపినందుకు ఎమ్మెల్యేలమని కూడా చూడకుండా పోలీసులు తమపై దాడి చేశారని కేటీఆర్‌ (KTR) ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను గవర్నర్‌కు చూపించినట్లు చెప్పారు. తమ మహిళా నాయకురాళ్ల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, చీరలు లాగుతూ దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించినట్లు కేటీఆర్​ తెలిపారు. తమపై దాడి జరిగినప్పటికీ, చివరకు తమపైనే కేసులు పెట్టారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని ఆరోపించారు.

కేసీఆర్‌ ఇంటి ఘటనపైనా ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసం వద్ద జరిగిన ఘటనను కూడా కేటీఆర్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తదితరులు దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పోలీసుల సహకారంతోనే కాంగ్రెస్‌ కార్యకర్తలు కేసీఆర్‌ ఇంటి వైపు వెళ్లారని కేటీఆర్‌ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన అంశాలపై కూడా గవర్నర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్తాం

ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ తప్పా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన అంశాలు 1000 రోజులు గడిచినా అమలు కాలేదని ప్రశ్నించేందుకే అసెంబ్లీకి వెళ్లామని అన్నారు. అయితే గేటు వద్దే పోలీసులు తమను అడ్డుకుని దాడి చేశారని ఆరోపించారు. ఇక ఈ వ్యవహారంపై గవర్నర్‌ సీఎస్‌, డీజీపీని పిలిచి విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో న్యాయం జరగకపోతే ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.

Also Read : కేసీఆర్‌పై వ్యాఖ్యల కలకలం.. ‘ఫ్లోలో అనేశాను’ అంటూ ఎమ్మెల్యే వివరణ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>