కురియన్ స్ఫూర్తితో కరీంనగర్‌ డెయిరీని నెం.1 గా నిలిపాం: ఛైర్మన్‌ రాజేశ్వర్‌రావు

కలం, కరీంనగర్ బ్యూరో: భారత శ్వేత విప్లవ పితామహుడు, అమూల్ బ్రాండ్ రూపశిల్పి స్వర్గీయ డాక్టర్ వర్గీస్ కురియన్ (Dr. Verghese Kurien) 14వ వర్ధంతి వేడుకలు (14th Death Anniversary Commemorations) బుధవారం కరీంనగర్ డెయిరీ (Karimnagar Dairy) ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కరీంనగర్ డెయిరీ ఛైర్మన్ సీహెచ్. రాజేశ్వర్ రావు (CH Rajeshwar Rao) ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ వర్గీస్ కురియన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​కురియన్ మార్గదర్శకత్వమే

​ఈ సందర్భంగా ఛైర్మన్ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. డాక్టర్ వర్గీస్ కురియన్ చూపిన బాటలో ఆయన స్పూర్తితో పనిచేయడం వల్లే ఈరోజు కరీంనగర్ డెయిరీ తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్-1 డెయిరీగా నిలబడగలిగిందని తెలిపారు. కురియన్‌‌‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయన ఆశయాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ​కేరళలోని కోజికోడ్‌లో 26 నవంబర్ 1921న జన్మించిన కురియన్, 1940లో ఫిజిక్స్‌లో డిగ్రీ, అనంతరం మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1948లో అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందారు.

ఆపరేషన్‌ ఫ్లడ్‌తో శ్వేత విప్లవం

​1949లో ఆనంద్ (గుజరాత్) లోని గవర్నమెంట్ రీసెర్చ్ క్రీమరీలో డెయిరీ ఇంజనీర్‌గా చేరి, త్రిభువన్‌దాస్ పటేల్ సారథ్యంలో ఖైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్‌లో మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. 46,400 మంది రైతులను, 219 సహకార సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి ప్రపంచ ప్రసిద్ధ “అమూల్ (Amul)” బ్రాండ్‌ను సృష్టించారు. అమూల్ విజయాన్ని మెచ్చిన నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు 1965లో జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (NDDB) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి, దేశంలో “ఆపరేషన్ ఫ్లడ్” ద్వారా శ్వేత విప్లవానికి నాంది పలికారు.

​5 లక్షల లీటర్ల పాల సేకరణ లక్ష్యం

కరీంనగర్ డెయిరీ భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తూ.. పాల సేకరణ ప్రస్తుతం రోజుకు 2,00,000 (2 లక్షల) లీటర్ల పాల సేకరణ జరుగుతోందని, రాబోయే రోజుల్లో దీనిని రోజుకు 5.0 లక్షల లీటర్లకు పెంచాలని స్పష్టమైన లక్ష్యంతో ఉన్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 2 లక్షల లీటర్ల అమ్మకాలను తెలంగాణలోని అన్ని జిల్లాలకూ విస్తరించి రోజుకు 5 లక్షల లీటర్ల సేల్స్ మైలురాయిని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ పి. శంకర్ రెడ్డి, డెయిరీ అధికారులు, సిబ్బంది, డైరెక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్గీస్ కురియన్ సేవలను స్మరించుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>