స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై మిథున్ రెడ్డి ఫైర్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ (BRS) నాయకులు అహంకారపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. ప్రజాపాలనలో ప్రభుత్వ పనులన్నీ సక్రమంగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వంపై లేవనెత్తేందుకు సరైన అంశాలు లేకపోవడంతోనే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో గొడవలకు దిగుతున్నారని విమర్శించారు.

దళిత స్పీకర్ పట్ల ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhusudan) అనుచిత వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యత తీసుకుని ఎమ్మెల్సీ తాతా మధును బర్తరఫ్ చేయడంతో పాటు ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి ప్రజలను మభ్యపెట్టేలా పబ్లిక్ స్టంట్లు చేస్తున్నారని మిథున్ రెడ్డి (Mithun Reddy) ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ప్రజాపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ మాట్లాడుతూ కేసీఆర్ డైరెక్షన్‌లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో డ్రామా చేశారని ఆరోపించారు. స్పీకర్ పట్ల ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్‌కు సంబంధం లేకపోతే వెంటనే ఆయనతో రాజీనామా చేయించి పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ఎమ్మెల్సీ మధు వ్యాఖ్యలకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నట్లుగా భావించాల్సి వస్తుందని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రకుమార్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కంచిమి లక్ష్మణ్, నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు.

Also Read : కరీంనగర్‌ పోలీస్ స్టేషన్ నుంచే పెట్రోలింగ్ వాహనం చోరీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>