కలం, ఖమ్మం బ్యూరో : రాబోయే గణపతి నవరాత్రి ఉత్సవాలను (Ganapati Navaratri celebrations)జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohit Raj) సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉత్సవాల నిర్వహణలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, అందులో భాగంగా గణేష్ మండపాలు, నిమజ్జన శోభాయాత్రల్లో డీజేల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా శాంతిభద్రతల పర్యవేక్షణ సులభతరం చేసేందుకు ప్రతీ గణేష్ మండపానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో పాటు జియో ట్యాగింగ్ చేయడం తప్పనిసరి అని తేల్చి చెప్పారు.
మండపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు ముందుగా తెలంగాణ పోలీసు శాఖకు (Telangana Police Department)చెందిన అధికారిక పోర్టల్ (http://policeportal.tspolice.gov.in/index.htm) ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆ దరఖాస్తు ప్రతులను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అందజేసి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ప్రధాన రహదారులు, ప్రజా రవాణా మార్గాలు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖ నుంచి సరైన అనుమతులు పొందిన తర్వాతే కనెక్షన్లు తీసుకోవాలని, అగ్ని ప్రమాద నివారణకు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు 24 గంటల పాటు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కోరారు.
డీజేలు, టపాసులపై ఆంక్షలు
ఉత్సవాల సమయంలోనూ, నిమజ్జన శోభాయాత్రలోనూ (Immersion Procession) డీజేలను ఉపయోగించడానికి ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ తేల్చి చెప్పారు. పోలీసుల అనుమతితో పరిమిత శబ్దంతో మాత్రమే స్పీకర్లను వాడాలని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. శోభాయాత్ర సందర్భంగా టపాసులు పేల్చడం నిషిద్ధమని, మద్యం సేవించి వాహనాలు నడిపినా, రహదారులపై వాహనాలను నిలిపివేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినా చట్టపరంగా తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఉత్సవాల సందర్భంగా రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని సహించేది లేదన్నారు. ప్రజలు అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని, గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పోలీసు శాఖకు సంపూర్ణంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

