ప్రతి మహిళ అక్షరాస్యురాలు కావాలి: కలెక్టర్ ప్రియాంక

కలం, నారాయణపేట : ప్రతి ఒక్కరు చదువుకోవాలి.. ప్రతి మహిళ అక్షరాస్యురాలు కావాలి.. ప్రతి గ్రామం సంపూర్ణ అక్షరాస్యత వైపు అడుగులు వేయాలనీ కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Collector Priyanka) అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం (International Literacy Day)సందర్భంగా మంగళవారం నారాయణపేట (Narayanpet)జిల్లా కేంద్రంలో నిర్వహించిన అక్షరాస్యత ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రియాంక ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సత్య నారాయణ చౌరస్తా వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అక్షరాస్యత అనేది కేవలం చదవడం, రాయడం మాత్రమే కాదని, అది వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తి అని కలెక్టర్ ప్రియాంక చదువు మనిషికి జ్ఞానం, ఆత్మవిశ్వాసం, స్వావలంబనను అందిస్తుందని తెలిపారు. నారాయణపేట జిల్లాలో అక్షరాస్యత శాతం 49.93 శాతం మాత్రమే ఉందని, పురుషుల అక్షరాస్యత 60.32 శాతం కాగా, మహిళల అక్షరాస్యత 39.72 శాతంగా ఉందని కలెక్టర్ తెలిపారు. మహిళల అక్షరాస్యతలో ఉన్న అంతరాన్ని తగ్గించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాల సహకారంతో మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

మరికల్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

మరికల్ (Marikal) తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పరిధిలో కొనసాగుతున్న కార్యకలాపాలపై తహశీల్దార్ రామ్‌కోటిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ భారతి కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన ఇతర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

పెండింగ్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కొత్తగా నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనం పరిసరాల్లో, ముఖ్యంగా ప్రహరీ చుట్టూ అపరిశుభ్రత నెలకొని ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలంలో చేపడుతున్న వీ.ఓ. భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని ఎంపీడీఓ పృథ్వీరాజ్‌కు కలెక్టర్ సూచించారు.

అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో మిస్ కావొద్దు

ఓటరు జాబితా పరిశీలన ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో (Voter list)మిస్ కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం ధన్వాడ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా పరిశీలన ప్రక్రియపై సంబంధిత ఎన్నికల అధికారులు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలతో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజూ ఎన్ని నోటీసులు జారీ చేస్తున్నారు, ఎంతమంది నుంచి అవసరమైన డాక్యుమెంట్లు స్వీకరిస్తున్నారు, ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అనే వివరాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నోటీసు జారీ చేసిన వెంటనే సంబంధిత ప్రక్రియను పూర్తి చేసి, వివరాలను యాప్‌లో ఎలాంటి జాప్యం లేకుండా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అభ్యర్థి తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేని సందర్భాల్లో నిబంధనల మేరకు క్షేత్రస్థాయిలోనే ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. అవసరమైన ఫోటోలు, ధృవీకరణ వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ప్రతి ఏ ఈ ఆర్ వో కు కేటాయించిన పోలింగ్ స్టేషన్ల సంఖ్య, వాటి పరిధిలో ఉన్న పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి ఫాలోఅప్‌ను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>