కలం, వెబ్ డెస్క్: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ (KCR Farmhouse) వద్దకు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ‘ఎంత మంది వస్తారో రండి.. అక్కడే తేల్చుకుందాం’ అంటూ కేటీఆర్, హరీశ్ రావు సహా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరారు. దీంతో ఇటు హైదరాబాద్, అటు ఎర్రవల్లిలో హై టెన్షన్ నెలకొంది. ఎప్పుడేం జరుగుతోందననే ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఇంటిపైకి దాడి చేసేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డినే పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి మరీ ఎమ్మెల్యేలను పంపిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి తాము ఎర్రవల్లికి వెళ్తున్నట్లు పేర్కొంటున్నారు.
భారీగా వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు..
కేసీఆర్ ఫాంహౌస్ దగ్గరకు కాంగ్రెస్ నేతలు భారీగా వస్తున్నారనే సమాచారంతో ఎర్రవల్లికి వెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే ఫాంహౌస్ దగ్గర హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు.. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. వందల కొద్ది పోలీసులను మోహరించి, ఫాంహౌస్ రోడ్లను పూర్తిగా మూసివేశారు. ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు.

