కలం, వనపర్తి బ్యూరో : ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం, అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy)ఆరోపించారు. ఎమ్మెల్యేలు తాత మధు, నవీన్‌రెడ్డిలను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వనపర్తి (Wanaparthy)అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట తప్పిందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సరికాదు :
హామీల అమలుపై నల్ల దుస్తులతో నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను(BRS MLAs) అడ్డుకోవడం సరికాదన్నారు. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి చేసి గాయపరచడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలు పార్లమెంట్‌లో రాజ్యాంగ పుస్తకాన్ని చేతబట్టి నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపితే తప్పేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం సభలో ఎండగడుతుందనే భయంతోనే ఎమ్మెల్యేలను సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పే వరకు పోరాటం :
ఇంతియాజ్ ఇసాక్ (Imtiaz Esack) మాట్లాడుతూ .. మహిళా పక్షపాతినని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన వ్యవహారానికి బాధ్యత వహించాలని అన్నారు. ప్రజా నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

