ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి యూ టర్న్.. ‘మంత్రి’ మంత్రమేనా?

కలం, నల్లగొండ బ్యూరో: ప్రభుత్వంపై, సీఎం రేవంత్ వైఖరిపై నిన్నటి వరకు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) ఒక్కసారిగా సైలెంట్ అయి యూటర్న్ తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీకి విధేయత కంటే రాజకీయ బలమే ముఖ్యమా.! పార్టీ క్రమశిక్షణ కంటే ఎన్నికల్లో గెలిచే సామర్థ్యమే ఎక్కువా.! అంటే ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

ఓ వైపు ‘పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు’ అని కాంగ్రెస్ అధిష్ఠానం హెచ్చరిస్తోంది. మరోవైపు సమతుల్యత, క్రమశిక్షణ అమలులో రెండు కొలమానాలు వినియోగిస్తుందనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల మంత్రివర్గం నుంచి కొండా సురేఖను (Konda Surekha) బర్తరఫ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి యూ టర్న్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

విమర్శల నుంచి సఖ్యత వరకు..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సొంత ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి నిర్ణయాలపై కౌంటర్ వ్యాఖ్యలు చేయడం నిత్యకృత్యంగా మారాయి. అయితే అసమ్మతి వర్గానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం, క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాయి. చివరకు ఆమెను మంత్రివర్గం నుంచే బర్తరఫ్ చేశాయి. పార్టీ గీత దాటితే మంత్రి పదవి.. మరే పదవి అయినా ఊడుతుందనే స్పష్టమైన హెచ్చరిక ఇచ్చాయి.

అయితే అధిష్ఠానం ఊహించని నిర్ణయంతో నిన్నమొన్నటి వరకు తీవ్ర విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. నిన్నటి వరకు ‘ పార్టీని కబ్జా చేశారు’ అని, ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక్కసారిగా తన తీరును మార్చుకుని తాజాగా నకిరేకల్‌లో నిర్వహించిన ‘ ప్రజా పాలన వికాస సభ’లో సీఎం రేవంత్‌తో కలిసి ఒకే వేదికను పంచుకోవడం, ముచ్చటించుకోవడం విస్తృత చర్చకు దారితీసింది.

నకిరేకల్ సభ వెనుక మాస్టర్ ప్లాన్?

కొన్నాళ్లుగా నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలుమార్లు పర్యటించిన సందర్భంలో జిల్లాకు చెందిన ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ప్రకారం హాజరైనా రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారా..! లేక అధిష్ఠానం నిర్ణయాలకు అనుగుణంగా ఉంటారా..! అనే ఊహాగానాలు కొనసాగాయి. తాజాగా నకిరేకల్ సభలో పాల్గొనడం వెనక త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణే కారణమనే చర్చ జోరుగా సాగుతోంది.

తనకు పదవి ఖరారైందనే స్పష్టమైన సంకేతాలు అధిష్ఠానం నుంచి రావడంతో ఆయన తగ్గారని టాక్ నడుస్తోంది. ఇన్ని రోజులు ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం క్యాబినెట్‌లో పదవి కోసం ఒత్తిడి పెంచడానికేనా అన్న అనుమానాలను పార్టీ జిల్లా నేతలు వ్యక్తం చేస్తున్నారు. ‘రాజన్న రాజ్యం తెస్తా.. కలిసొస్తే సీఎం అవుతా..!’ అని తొడకొట్టిన రాజగోపాల్ రెడ్డికి నకిరేకల్ సభనే ఆజ్యం పోయనుందా? లేక వేటు తప్పదనే భయంతో సైలెంట్ అయ్యారా? అనేది వేచి చూడాలి.

క్రమశిక్షణ నిబంధనల్లో డబుల్ స్టాండర్డ్స్?

కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే క్రమశిక్షణా చర్యలు నిజంగానే పార్టీని క్రమబద్ధీకరించే ఉద్దేశంతో కూడుకున్నవా? అయితే అవి అందరికీ ఒకేలా వర్తిస్తున్నాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలతోనే తల్లిపై వేటు వేశారని, మరి సొంత పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా బహిరంగ విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డికి ఆ క్రమశిక్షణ వర్తించదా? అని బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కొండా సురేఖ బీసీ కావడంతోనే వెంటనే బర్తరఫ్ చేశారా? ఆర్థిక బలం, రెడ్డి సామాజికవర్గ నేపథ్యం ఉంటే క్రమశిక్షణా చర్యలు వర్తించవా? అంటూ బీసీ సంఘాలు, నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిబంధన ఒకటి ఉన్నప్పుడు అమలు కూడా అందరికీ ఒకేలా ఉండాలి కదా? లేకపోతే క్యా మతలబ్ హై..? అని, ఒకే పార్టీలో క్రమశిక్షణకు రెండు వేర్వేరు కొలమానాలు ఉన్నాయా? అని పార్టీ సామాన్య కార్యకర్తలు కూడా నిలదీస్తున్నారు. మొత్తానికి కొండా సురేఖ భర్తరఫ్‌తో పార్టీలో క్రమశిక్షణ గీత దాటితే వేటు తప్పదన్న సంకేతాలైతే వెళ్లాయి. మరి రాబోయే క్యాబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా? లేక నకిరేకల్ వేదికగా కనిపించిన సఖ్యత తాత్కాలికమేనా? రాబోయే రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్​లో రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

అన్నదమ్ముల తీరుపై కొత్త చర్చ..

సీఎం రేవంత్ సభలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వేదిక పంచుకున్నారు. అయితే అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు.
అన్నదమ్ముల తీరు కాంగ్రెస్ అంతర్గత సమీకరణాలపై కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కీలక నేతల వైఖరిలోని మార్పుల వెనక రాజకీయ వ్యూహం ఏంటనేది సొంత పార్టీ వర్గాల్లోనే ఆసక్తి రేకెత్తిస్తోంది.

Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అరెస్ట్.. కేటీఆర్ ఆగ్రహం..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>