కలం, పెద్దపల్లి: పెద్దపల్లి (Peddapalli) నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ప్రధాన రోడ్లపై బైఠాయించి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. వర్షాకాలం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం రోజున నుండి ప్రారంభం కాగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మండిపడ్డారు.
అతడిని వెంటనే శాసనమండలి నుండి తొలగించాలని అన్నారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు చేసిన హంగామా అంతాఇంతా కాదని.. వారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం అలవాటైపోయిందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కేసీఆర్ ఆదివారం రోజున బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించి తమ పార్టీ శాసనసభ్యులకు స్పీకర్ ను దూషించమని దిశానిర్దేశం చేశారా? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ చేస్తున్న అనైతిక చర్యలను ప్రజలందరూ గమనిస్తున్నారని.. వారికి మళ్ళీ తిరిగి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారని తెలిపారు. స్పీకర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల చిత్తశుద్ధితో బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యల పట్ల నిండు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కంటతడి పెట్టడం బాధాకరమని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

