మందుల పేరుతో మరణశాసనం.. మైనర్లే క్యారియర్లు!

కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా వ్యాప్తంగా గంజాయి, హాష్ ఆయిల్, మత్తు టాబ్లెట్ల సంస్కృతి  తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు కేవలం మహానగరాలకే పరిమితమైన ఈ డ్రగ్స్ సంస్కృతి, ఇప్పుడు జిల్లా కేంద్రాల నుంచి పల్లెల వరకు విచ్చలవిడిగా విస్తరించింది. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా ముఠాలు తమ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసుకుంటున్నాయి. ఇటీవల నల్గొండ జిల్లాలో గంజాయి మత్తులో మైనర్లు ఒక ప్రిన్సిపాల్‌పై దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అలాంటి భయాందోళనకర పరిస్థితులే నెలకొన్నాయి.

మైనర్లే ‘క్యారియర్లు’.. పెద్దల కుట్ర

మత్తు పదార్థాల అసలు సూత్రధారులు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు విద్యార్థులను ‘క్యారియర్లు’గా వాడుకుంటున్నారు. మైనర్లు పట్టుబడినా జువైనైల్ చట్టాల వల్ల తీవ్ర శిక్షలు ఉండవనే భావనను బడా వ్యాపారులు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మొదట ఉచితంగా లేదా తక్కువ ధరకే అలవాటు చేసి, ఆ తర్వాత వారి చేతే ఇతరులకు సరఫరా చేయిస్తున్నారు.

కుటుంబాల్లో పర్యవేక్షణ లోపం, స్నేహితుల ఒత్తిడి, సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలు ఈ నేరాల వైపు మళ్లుతున్నారు. అసలు సూత్రధారులు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వీరిని ‘క్యారియర్లు’గా వాడుకుంటున్నారు. మైనర్లు పట్టుబడినా జువైనైల్ చట్టాల వల్ల తీవ్ర శిక్షలు ఉండవనే లొసుగును బడా వ్యాపారులు వాడుకుంటున్నారు. మొదట ఉచితంగా అలవాటు చేసి, ఆ తర్వాత వారి చేతే ఇతరులకు సరఫరా చేయిస్తున్నారు.

మెడికల్ షాపులే ‘మత్తు’ స్థావరాలు

ప్రభుత్వం గంజాయిపై యుద్ధం ప్రకటించడంతో నిషా కోరులు కొత్త దారులు వెతుకుతున్నారు. గంజాయికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి ప్రమాదకర పదార్థాలు వచ్చాయి. ఒడిశా నుంచి వస్తున్న హాష్ ఆయిల్ లీటర్ ధర రూ. 30 నుండి 40 లక్షలు పలుకుతోంది. ఒక్క డ్రాప్ హాష్ ఆయిల్ ధరను రూ. 4,000 నుండి 5,000 వరకు విక్రయిస్తున్నారు. నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే టాబ్లెట్లు, సిరప్‌లను కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు ప్రిస్క్రిప్షన్ లేకుండా రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. యువత ఈ మాత్రలను కరిగించి, సిరంజీల ద్వారా నేరుగా నరాల్లోకి ఇంజెక్షన్లుగా ఎక్కించుకుంటున్నారు.

కరీంనగర్ (Karimnagar) రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో డ్రగ్స్, హాష్ ఆయిల్, గంజాయితో పాటు మత్తు టాబ్లెట్లు వాడుతున్న 9 మంది యువకులను అరెస్ట్ చేశారు. వారి వాంగ్మూలం ఆధారంగా అక్రమంగా మత్తు మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపును పోలీసులు సీజ్ చేశారు. అలాగే జిల్లాలోని 10 మెడికల్ షాపులకు డ్రగ్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

దర్యాప్తులోని లోపాలు..’బ్యాక్‌వర్డ్ ట్రేసింగ్’ ఏది?

పోలీసులు విచారణ జరిపి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, ఇన్వెస్టిగేషన్ కేవలం ‘చివరి లింక్’ (క్యారియర్లు/బాధితులు) దగ్గరే ఆగిపోతోందనే విమర్శలు ఉన్నాయి. డిజిటల్ కవర్-అప్: సూత్రధారులు నేరుగా నగదు తీసుకోకుండా QR కోడ్లు, ఆన్‌లైన్ పేమెంట్లు వాడుతున్నారు. గంజాయిని రహస్య ‘Drop Points’ లో ఉంచి కేవలం లొకేషన్ పిన్ మాత్రమే పంపుతూ తప్పించుకుంటున్నారు. హవాలా, బ్యాంక్ లావాదేవీలపై లోతైన విచారణ జరగకపోవడం వల్ల అసలు ముఠా నాయకులు యథేచ్ఛగా తిరుగుతున్నారు.

దర్యాప్తులో రావాల్సిన కీలక మార్పులు..

పట్టుబడిన వారి కాల్ డేటా రిపోర్ట్ ను నిశితంగా విశ్లేషించి, నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సరఫరాదారులను (‘బ్యాక్‌వర్డ్ ట్రేసింగ్’) పట్టుకోవాలి. యూపీఐ (UPI) లావాదేవీలు, బ్యాంక్ ఖాతాలు, హవాలా మూలాలను వెంటాడి, ఫైనాన్షియర్లను అరెస్ట్ చేయాలి. విద్యాసంస్థలు, ప్రైవేట్ హాస్టళ్లు, నిర్మాణంలో ఉన్న భవనాలను ప్రత్యేకంగా మ్యాపింగ్ చేసి డ్రోన్లు, అత్యాధునిక సీసీటీవీల ద్వారా నిరంతర నిఘా ఉంచాలి.

పిల్లలలో ఆకస్మిక మార్పులు (చదువుపై శ్రద్ధ తగ్గడం, నిద్రలేమి, ఎక్కువ డబ్బులు అడగడం) గమనిస్తే వెంటనే కౌన్సిలింగ్ ఇప్పించాలి. పోలీస్ యంత్రాంగం, డ్రగ్స్ నియంత్రణ అధికారులు, విద్యాసంస్థలు మరియు తల్లిదండ్రులు కలసికట్టుగా పోరాడినప్పుడే ఈ మత్తు రాక్షసి నుండి యౌవనాన్ని, విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోగలమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

గణాంకాలు చెబుతున్న భయానక నిజాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టుబడుతున్న కేసులను పరిశీలిస్తే దిగ్భ్రాంతికర విషయాలు బయటపడుతున్నాయి.  2025 సంవత్సరంలో 234 కేసులు నమోదు కాగా..   553 మందిని అరెస్టు చేసి 291 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.  2026 (జూలై వరకు) సంవత్సరంలో 139 కేసులు నమోదు కాగా.. 257 మందిని అరెస్టు చేసి 157 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో అధిక శాతం మంది మైనర్లు, చదువుకునే విద్యార్థులే కావడం గమనార్హం.

అధికారుల నిర్లక్ష్యం..

ఉమ్మడి జిల్లా(Karimnagar)లోని వివిధ ప్రాంతాల్లో మెడికల్ షాపుల సంఖ్య పెరుగుతున్నా, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల తనిఖీలు మాత్రం నామమాత్రంగానే సాగుతున్నాయి. నెలకో, రెండు నెలలకో ఒకసారి షాపులను సందర్శిస్తున్న అధికారులు, కేవలం మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో 2500 పైగా మెడికల్ షాపులు ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. నెలకు ఒకటి రెండు చోట్ల దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. తనిఖీలు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ మెడికల్ మాఫియా రెచ్చిపోతోందని స్పష్టమవుతోంది.

అర్హత గల ఫార్మసిస్ట్లు లేకపోయినా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా యధేచ్ఛగా మందుల విక్రయాలు సాగుతున్నాయి. బాధ్యత గల డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చాలా చోట్ల ఫార్మసీ చదివిన వారికి నెలకు రూ. 15 నుంచి 50 వేల రూపాయల వరకు చెల్లించి వారి సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుంటున్నారు. అసలు మందుల గురించి అవగాహన లేని వ్యక్తులతోనే ఈ వ్యాపారం సాగుతోంది. కేవలం ఓవర్ ది కౌంటర్ (OTC) మందులు మాత్రమే నేరుగా అమ్మాలి. కానీ డాక్టర్ల చీటీ లేకుండానే శక్తివంతమైన యాంటీబయాటిక్స్ విక్రయిస్తున్నారు.

దీనివల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన గర్భ నిరోధక , గర్భ విచ్ఛిన్న మాత్రలను ఎటువంటి డాక్టర్ సిఫార్సు లేకుండానే విక్రయిస్తున్నారు. ఇది మహిళల ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. ప్రాణాధార మందులు, టీకాలను రిఫ్రిజిరేటర్లలో భద్రపరచాలి. కానీ చాలా షాపుల్లో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో మందుల నాణ్యత దెబ్బతింటోంది.

Also Read : శీతల్ దేవి ఫైనల్‌కు.. భారత్‌కు పతకం ఖాయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>