కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ అభివృద్ధికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదనడం మాజీ మేయర్ రవీందర్ సింగ్ రాజకీయ అజ్ఞానానికి, దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు (BJP Leader Praveen Rao) మండిపడ్డారు. సోమవారం పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రవీందర్ సింగ్ విసిరిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని, బండి సంజయ్ కృషితోనే కరీంనగర్‌కు వేల కోట్ల నిధులు వచ్చాయని లెక్కలతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు.
ఆ ఘనత బండి సంజయ్ దే..
కేంద్రం నుంచి తెచ్చిన నిధుల వివరాలను మీడియా ముందుంచుతూ, బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) సాధించిన అభివృద్ధిని ప్రవీణ్ రావు వివరించారు. కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ నిధులు ఎంపీ బండి సంజయ్ కృషితోనే వచ్చాయన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు జమ చేయలేక చేతులెత్తేసినా, కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా కూడా కేంద్ర నిధులను బల్దియాకు తీసుకువచ్చారని చెప్పారు.
ఎంపీలాండ్స్ & CSR ఫండ్స్..
ఎంపీలాండ్స్ కింద దాదాపు రూ. 17 కోట్లు ఖర్చు చేసి బోర్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మించారని ప్రవీణ్ రావు (Praveen Rao) చెప్పారు. అలాగే CSR నిధులతో 10వ తరగతి విద్యార్థులకు 20,000 సైకిళ్లు, ఆసుపత్రులకు రూ. కోటికి పైగా వైద్య సామాగ్రి, అంబులెన్సులు, మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారని అన్నారు. కరీంనగర్ – వరంగల్ నేషనల్ హైవే కోసం రూ. 4,500 కోట్లు, అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్ ఆధునీకరణకు రూ. 50 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేతులెత్తేసిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణానికి ‘సేతు బంధు’ కింద రూ. 150 కోట్లు తెచ్చి పనులు ప్రారంభించారని అన్నారు. ఈజీఎస్ (EGS) ఇతర కేంద్ర పథకాల ద్వారా ప్రతి సంవత్సరం గ్రామాలు, మండలాల్లో రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించారని పేర్కొన్నారు.
అందువల్లే సింగిల్ డిజిట్..
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కార్పొరేషన్లో అభివృద్ధిని నిర్వీర్యం చేయడం వల్లే నగర ప్రజలు ఆ పార్టీని సింగిల్ డిజిట్‌కు పరిమితం చేశారని ప్రవీణ్ రావు ఎద్దేవా చేశారు. బండి సంజయ్ అభివృద్ధిపై ప్రజలకు ఉన్న విశ్వాసంతోనే నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగిరిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే ప్రతి డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ కోలగాని శ్రీనివాస్‌పై రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ప్రవీణ్ రావు సవాల్..
బండి సంజయ్ రూపాయి కూడా తేలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న రవీందర్ సింగ్ తన మాటపై కట్టుబడి ఉండాలని, దమ్ముంటే చర్చకు సమయం, వేదిక ప్రకటించాలని ప్రవీణ్ రావు సవాల్ విసిరారు. లేకపోతే నిరాధార ఆరోపణలు చేసినందుకు నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు బండారి వేణు, బండ రమణారెడ్డి, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, గాజ రమ శివరాం, కర్రె పద్మ అనిల్, కొలిపాక శ్రీనివాస్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, జాడి బాల్ రెడ్డి, తోట అనిల్, వంగల రవి గోపాల్, కేఏ పీపీ చంద్ర, అప్పాల శ్రీనివాస్, దయ్యాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Also Read : తెలంగాణలో SIR గడువు పొడిగింపు..
Follow Us On: X(Twitter)

