శీతల్ దేవి ఫైనల్‌కు.. భారత్‌కు పతకం ఖాయం

కలం, స్పోర్ట్స్ : ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ ఆర్చర్ శీతల్ దేవి (Sheetal Devi) మరోసారి సత్తా చాటింది. వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్(World Archery Para Series)  స్టేజ్-3లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ఆల్-ఇండియా సెమీఫైనల్లో సహచరురాలు సరితను 145-143తో ఓడించింది. దీంతో ఈ విభాగంలో భారత్‌కు కనీసం ఒక పతకం ఖాయమైంది. సెమీఫైనల్లో సరిత నుంచి శీతల్‌కు గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ కీలక దశల్లో వరుసగా పాయింట్లు సాధిస్తూ శీతల్ మ్యాచ్‌పై పట్టు సాధించింది. చివరకు 145-143తో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది.

ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన ఐజాదా సైదాన్‌తో శీతల్ దేవి తలపడనుంది. స్వర్ణం కోసం ఇద్దరు పోటీ పడనున్నారు. మరోవైపు సెమీఫైనల్లో ఓడిన సరితకు కాంస్య పతకం సాధించే అవకాశం ఉంది. మూడో స్థానం కోసం చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్‌తో ఆమె పోటీ పడనుంది. దీంతో మహిళల కాంపౌండ్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు దక్కే అవకాశం ఉంది.

టోమన్ కుమార్‌కు ఎదురుదెబ్బ

పురుషుల కాంపౌండ్ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. ప్రపంచ ఛాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ టోమన్ కుమార్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. టాప్ సీడ్ కెన్ స్వాగుమిలాంగ్ చేతిలో 146-144తో పరాజయం చవిచూశాడు. దీంతో టోమన్ ఇప్పుడు కాంస్య పతకం కోసం పోరాడనున్నాడు. ఇరాక్‌కు చెందిన అబ్బాస్ ఖాదిమ్ అతడికి ప్రత్యర్థిగా నిలవనున్నాడు. అంతకుముందు క్వార్టర్‌ఫైనల్లో మరో భారత ఆర్చర్ గుర్విందర్ సింగ్ కూడా స్వాగుమిలాంగ్ చేతిలోనే ఓడిపోయాడు. 141-143తో పోరాడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

డబ్ల్యూ1లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు

పురుషుల డబ్ల్యూ1 విభాగంలో భారత పోరాటం ముగిసింది. ఐదో సీడ్ అదిల్ మహ్మద్ నజీర్ అన్సారీ, తొమ్మిదో సీడ్ నూరుదిన్ క్వార్టర్‌ఫైనల్లోనే నిష్క్రమించారు. అదిల్ షూట్‌ఆఫ్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన డేవిడ్ ద్రాహోనిన్స్కీ చేతిలో 5-6తో ఓడగా.. నూరుదిన్ చైనా టాప్ సీడ్ యాంగ్ జుపెంగ్ చేతిలో 2-6తో పరాజయం పాలయ్యాడు. అయితే మహిళల డబ్ల్యూ1 విభాగంలో భారత్‌కు పతక ఆశలు కొనసాగుతున్నాయి. రెండో సీడ్ స్వాతి చౌదరి కాంస్య పతకం కోసం బరిలోకి దిగనుంది. సెమీఫైనల్లో చైనాకు చెందిన లియు జింగ్ చేతిలో 1-7తో ఓడిన స్వాతి.. మూడో స్థానం కోసం పోరాడనుంది. మహిళల కాంపౌండ్ విభాగంలో శీతల్ దేవి స్వర్ణం కోసం, సరిత కాంస్యం కోసం బరిలోకి దిగనుండటంతో భారత్‌కు ఈ విభాగంలో రెండు పతకాలు ఖాయమయ్యే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>