చండ్రుగొండ బీఆర్‌ఎస్‌లో వర్గపోరు.. వినతి పత్రం ఒకటే, గ్రూపులు రెండూ!

కలం, ​చండ్రుగొండ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమం, చండ్రుగొండ మండల బీఆర్ఎస్ (Chandrugonda BRS)లోని తీవ్ర వర్గపోరును బహిర్గతం చేసింది. ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం ఇచ్చే ప్రధాన ఉద్దేశం ఒకటే అయినప్పటికీ, నాయకులు మాత్రం రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా మెమోరాండాలు సమర్పించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

​సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం రెండు వేర్వేరు బృందాలుగా తరలివచ్చింది. ఒకవైపు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒక వర్గం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

మరొకవైపు మాజీ ఎమ్మెల్యే, ట్రైకార్ మాజీ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, చండ్రుగొండ మాజీ టౌన్ అధ్యక్షుడు సూరా వెంకటేశ్వర్లు, నరుకుల్లా సత్యంల నేతృత్వంలో మరో గ్రూపు విడిగా వచ్చి ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ వినతిపత్రం అందజేసింది. ఈ రెండు విడివిడి కార్యక్రమాల్లోనూ ఆయా వర్గాలకు చెందిన మండల, గ్రామీణ స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనడం విశేషం.

​ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ఆరు గ్యారంటీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీ, ఇలా విభేదాలతో రోడ్డుకెక్కడం చూసి మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “మన కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించేది పక్కనబెట్టి, ముందు వీళ్ల అంతర్గత పంచాయితీలు వీళ్లు తేల్చుకుంటే చాలు” అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు సడలి పోతుందనడానికి, వర్గపోరు పరాకాష్టకు చేరిందనడానికి ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>