కలం, పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైందని.. ఆ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో హామీల అమలుపై వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత హామీల అమలును విస్మరించిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుందని అన్నారు. మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు, ఉద్యోగులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని, కానీ వాటిలో చాలావరకు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన ఆరోపించారు.
ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను కాలపరిమితితో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తుందని, ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న హామీలను వెంటనే అమలు చేసే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత, విద్యార్థులు మరియు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

