కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లా పెద్దవూర (Peddavoora) మండల కేంద్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన (BRS Protest) కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలపై స్పందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విరుచుకుపడ్డాయి.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..
ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో పెద్దవూర పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి చెయ్యి దాటిపోకుండా అదుపులోకి తెచ్చేందుకు రవాణా మార్గాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.
అప్పటివరకు ఆపేది లేదు..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. ఎంతమంది పోలీసులతో అడ్డుకున్నా, ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ నిరసనలు ఆపేది లేదని తెగేసి చెప్పారు.

