కలం, కరీంనగర్: భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా ఆఫీస్ బేరర్ల సమావేశం స్థానిక ముకుందలాల్ మిశ్రా భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజినీకాంత్ (Shanigarapu Rajinikanth)హాజరయ్యారు. ఈ సందర్భంగా శనిగరపు రజనీకాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నామని సంబరాలు చేసుకుంటోందని, అయితే విద్యారంగానికి ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేసిందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ముఖ్యంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలోని దాదాపు 24 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్రను ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. “మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యారంగానికి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
జీవో నం. 97 తీసుకువచ్చి ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. తక్షణమే జీవో నం. 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అయినప్పటికీ చట్టసభల్లో విద్యారంగ సమస్యలపై కనీసం చర్చ జరగకపోవడం దారుణమన్నారు.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి, సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేపడతామని శనిగర రజనీకాంత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అరవింద్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, భోగేష్, సహాయ కార్యదర్శులు ఆకాష్, మానస, నాయకులు సన్నీ తదితరులు పాల్గొన్నారు.

