కలం, మక్తల్ : అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడం సిగ్గుచేటని, తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Ram Mohan Reddy) డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మహిళ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ వద్ద జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం మక్తల్ (Makthal) పట్టణంలోని 167 వ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో (BRS Protest) చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ.. గత మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని, ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు నల్ల టీ షర్టులు ధరించి వెళ్తున్న ఎమ్మెల్యేలపై దాడి జరగడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అన్నారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం, బిఆర్ఎస్ ముఖ్య నాయకులను మక్తల్ పోలీసులు అదుపులోకి తీసుకొని నర్వ వైపు తరలించడంతో కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్, నాయకులు మహిపాల్ రెడ్డి, చిన్న హనుమంతు, రుద్ర సముద్రం రామలింగం, నరసింహారెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

