కలం, కరీంనగర్ బ్యూరో: దక్షిణ కాశీగా, ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన ధర్మపురి (Dharmpuri) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (Lakshmi Narasimha Swamy Temple) ఇక సరికొత్త రూపాన్ని సంతరించుకోనుంది. దశాబ్దాలుగా భక్తులు, స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్న ఆలయాభివృద్ధికి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. సుమారు రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ పరిసరాలను సమగ్రంగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సోమవారం వేకువజామున 2:58 గంటలకు వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy CM) భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు ఆలయంలోని శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి,శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితులు మంత్రోచ్ఛారణలతో వారికి వేదాశీర్వచనం అందించి, స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ధర్మపురి ఆలయాభివృద్ధిపై గతంలో అనేక హామీలు వచ్చినప్పటికీ నిధుల కేటాయింపులో ఆశించిన స్థాయిలో చర్యలు జరగలేదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితం కాకుండా పనులతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ. 117 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభ్యర్థన మేరకు భక్తుల సౌకర్యాలు, ఆలయాభివృద్ధి కోసం మరో రూ. 80 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ధర్మపురి క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టామని భట్టి విక్రమార్క వెల్లడించారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బాసర నుంచి భద్రాచలం వరకు నది పరివాహక ప్రాంతాల్లోని ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు.
ఆలయంలో శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు ఇవే..
. రూ. 10 కోట్లతో శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం.
. రూ. 58.55 కోట్లతో తొమ్మిది రకాల మౌలిక వసతులు, ఆలయాభివృద్ధి నిర్మాణ పనులు.
. రూ. 22.16 కోట్లతో గోదావరి పుష్కరాల కోసం నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం.
. రూ. 2.48 కోట్లతో ధర్మపురి మండలం తిమ్మాపూర్ వద్ద నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం.
ఇకపోతే..ఆలయ పునర్నిర్మాణంతో పాటు మౌలిక వసతులు, పుష్కర ఘాట్లు, విద్యుత్ సౌకర్యాల అభివృద్ధి పూర్తయితే ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల అభివృద్ధితో ఆధ్యాత్మిక పర్యాటకానికి కూడా ఊతం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంపై ధర్మపురి భక్తులు,స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.శతాబ్దాల ఆధ్యాత్మిక వైభవానికి ఆధునిక మౌలిక వసతులు తోడైతే ధర్మపురి మరింత విశిష్టమైన పుణ్యక్షేత్రంగా ఎదగనుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

