కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గద్వాల (Gadwal) పట్టణంలో చోటు చేసుకుంది. నరేష్ అనే యువకుడు సూసైడ్ నోట్ రాసి, దాన్ని వాట్సప్ స్టేటస్ పెట్టుకుని మరీ ఆత్మహత్యాయత్నం చేశాడు. కొంతకాలంగా భార్యతో వివాదాలు జరుగుతుండటంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు అందులో పేర్కొన్నాడు.
సమస్య పరిష్కారం కాలేదని..
గతంలో రెండు సార్లు జిల్లా కేంద్రంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని కాపాడినట్లు నోట్‌లో తెలిపాడు. అయినా తన సమస్య పరిష్కారం కాలేదని, తన పిల్లలు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేశానంటూ నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. పిల్లలను చివరిసారిగా చూడాలనుందని, అయితే వారు వచ్చే సమయానికి తాను ఉండకపోవచ్చని అందులో పేర్కొనడం గమనార్హం.
వారే కారణం..
తాను ఆత్మహత్య చేసుకోవడానికి కొందరు పోలీసు సిబ్బంది, భార్యకు చెందిన కొందరు బంధువులే కారణమని నరేష్ ఆరోపించాడు. అయితే తన భార్యకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని నోట్‌లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్‌ను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్న అనంతరం నరేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

