కలం, తెలంగాణ బ్యూరో: సొంత రాష్ట్రం వస్తే పీఆర్సీలు, డీఏలు సమయానికి వస్తాయని ఆశించిన ఉద్యోగులకే నిరాశే ఎదురవుతోందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి (Lachi Reddy) వ్యాఖ్యానించారు. తమ సమస్యలు తీరుతాయని ఆశించిన ఉద్యోగులకు స్వరాష్ట్రంలోనే అన్యాయం జరుగుతోందన్నారు. సకల జనుల సమ్మె చేసి తెలంగాణ ఉద్యమంలోకి దూకారాని, 12 ఏళ్ల పాలనలో వారి ఆశలు అడియాశలయ్యాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడమే ఉద్యోగులకు శాపమా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్టు ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లు ఈ నెల 10న చేపడుతున్న మహాధర్నా నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన ‘ఉద్యోగుల సంకల్ప సభ’లో లచ్చిరెడ్డి మాట్లాడారు.
అమలు కాని సీఎం, డిప్యూటీ సీఎం హామీలు..
ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్సీ, డీఏలు పెండింగ్‌లో లేవని, ఇప్పుడు ఎందుకు ఉన్నాయని లచ్చిరెడ్డి (Lachi Reddy) ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనేకసార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో, జేఏసీ నేతలతో చర్చలు జరిపారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని చెప్పారు.
పీఆర్సీ నివేదికను జూన్ 2న తెప్పించుకొని అమలు చేస్తామని స్వయంగా సీఎం హామీ ఇచ్చినా అమల్లోకి రాలేదన్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఆగడం లేదని, ఉద్యోగులకు (Telangana Govt Employees) హక్కుగా రావాల్సిన పీఆర్సీ, డీఏల వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందనే తీరులో ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని లచ్చిరెడ్డి ఆరోపించారు.
మానవీయ కోణంలో ఆలోచించండి..
ఉద్యోగులపై వివక్ష, చిన్నచూపు ఎందుకని లచ్చిరెడ్డి ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ సంఘాలకు స్వేచ్ఛ వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ఉద్యోగులదే కీలక పాత్ర అని, ప్రభుత్వాన్ని బెదిరించడం లేదన్నారు. ఉద్యోగుల పట్ల మానవీయకోణంలో ఆలోచించాలనే కోరుతున్నామని పేర్కొన్నారు. పదవీ విరమణ సమయంలో రావాల్సిన డబ్బులు రాకపోతే ఆ ఉద్యోగి పడే మానసిక వేదనను అర్థం చేసుకోవాలని కోరారు.
ఉద్యోగుల జేఏసీ ప్రధాన డిమాండ్లు..
ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ (JAC) కొన్ని ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టింది. మొత్తం 42 అంశాలకు పరిష్కారం లభించాల్సి ఉందని ప్రధాన కార్యదర్శికి గతంలోనే మెమొరాండం ఇచ్చినట్లు గుర్తు చేసింది. ఉన్నతాధికారుల తప్పుడు సమాచారంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని, 20 ఏళ్లకు పైగా పనిచేసిన వారికి ప్రభుత్వం నుంచి రిలీఫ్ ఎక్కడుందని లచ్చిరెడ్డి ప్రశ్నించారు.
- పీఆర్సీ, పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి.
- కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను పునరుద్ధరించాలి.
- 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి ఓపీఎస్ అమలు చేయాలి
- పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను తక్షణమే చెల్లించాలి.
- ప్రతి నెలా రూ.2 వేల కోట్లు విడుదల చేయాలి.
- జీవో 317, జీవో 25 సమస్యలను పరిష్కరించాలి.
- 61 ఏళ్ల వయసు పైబడిన వీఆర్ఏలకు జీవో 81 అమలు చేయాలి.
- కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.
Also Read : సీఎం రేవంత్ ఇలాకాలో కవిత సభ
Follow Us On: X(Twitter)

