కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద విషాదకర సంఘటన (Khammam Hospital Tragedy) చోటుచేసుకుంది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం, వైద్యుల అశ్రద్ధ కారణంగానే తమ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ బాధితులు, వారి బంధువులు ఆసుపత్రి ఎదుట తీవ్ర నిరసన చేపట్టారు. బాధితుల వివరాల ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన శ్రీకాంత్, సంధ్య దంపతుల రెండేళ్ల కుమార్తెకు తీవ్ర జ్వరం రావడంతో శనివారం ఖమ్మంలోని హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. అయితే ఆదివారం రోజున చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. దీంతో గుండెకోతకు గురైన తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగి కన్నీరు మున్నీరుగా విలపించారు.
చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినప్పటికీ వైద్యులు సకాలంలో స్పందించలేదని, పాప ఆరోగ్యం గురించి కనీస వివరాలు చెప్పకుండా కాలయాపన చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స పేరుతో ఆసుపత్రి యాజమాన్యం దారుణ దోపిడీకి పాల్పడిందని, ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.7,000 నుండి రూ.10,000 వరకు లాక్కున్నారని వారు ఆరోపించారు. చివరికి డబ్బులు చెల్లించే వరకు వైద్య నివేదికలు కూడా ఇవ్వలేదని, చిన్నారి ప్రాణాలు పోయినా ఆసుపత్రి వర్గాలు కేవలం వ్యాపార ధోరణితోనే వ్యవహరించాయని మండిపడ్డారు.
అంతేకాకుండా ఆసుపత్రిలో సరైన అత్యవసర వైద్య పరికరాలు లేవని, అనుభవం లేని కాంపౌండర్లు, సిబ్బందితో వైద్యం చేయించడం వల్లనే తమ చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయని దంపతులు వాపోయారు. పసిపాపను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేశాయి. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, బాధ్యులైన వైద్యులపై అలాగే హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

