కలం, కరీంనగర్: కరీంనగర్‌లో (Karimnagar) బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యార్థి, యువ సమరభేరి’ సభ విజయవంతం కావడంతో బీజేపీ నాయకుల్లో భయం, అసహనం మొదలయ్యాయని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ (Sardar Ravinder Singh) అన్నారు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. యువత, విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ సమస్యలపై కేటీఆర్ భరోసా కల్పిస్తుంటే బీజేపీ నేతలకు ఎందుకు కడుపుమంట అని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. కేటీఆర్‌ను విమర్శించే ముందు ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ నగరానికి, జిల్లాకు తీసుకొచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
శాతవాహన యూనివర్సిటీకి 12బీ హోదా, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలకు అటానమస్ హోదా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని తెలిపారు. ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయవద్దని బీజేపీ నేతలను హెచ్చరించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకే ప్రస్తుతం బీజేపీ నాయకులు కొబ్బరికాయలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ నగరంలో పారిశుధ్య పరిస్థితులు దారుణంగా మారాయని రవీందర్ సింగ్ ఆరోపించారు.
బీజేపీకి చెందిన సొంత కార్పొరేటర్లే నగర పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి, నిధుల వినియోగంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం మానుకోవాలని, ఇతరులను విమర్శించే ముందు తమ స్థాయి ఏంటో తెలుసుకోవాలని రవీందర్ సింగ్ హితవు పలికారు.

