కలం, అశ్వారావుపేట : బురదమయమైన రహదారులపై వరినాట్లు నాటుతూ.. నిలిచిపోయిన మురుగునీటిలో కాగితపు పడవలు వదులుతూ ఆసుపాక గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన (BRS Protest) ప్రదర్శన నిర్వహించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన, హామీల అమలులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ‘పోరుబాట’ కార్యక్రమం 5వ రోజు ఆదివారం అశ్వారావుపేట మండలం ఆసుపాకలో హోరెత్తింది.
”పారిశుధ్యం ఎక్కడ? పడకేసింది ఇక్కడ!” అంటూ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామంలో రోడ్ల మరమ్మత్తులు పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారిన వీధుల్లో వరినాట్లు నాటి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే, అసంపూర్తి సీసీ రోడ్ల వల్ల నిలిచిన మురుగునీటిలో పేపర్ బోట్లు వదిలి ప్రభుత్వ అలసత్వాన్ని ఎండగట్టారు.
నిరసన అనంతరం నాయకులు, కార్యకర్తలు స్వయంగా చీపుర్లు పట్టి వీధులను ఊడ్చారు. డ్రైనేజీలు, తాగునీటి బావుల వద్ద పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసి శ్రమదానం చేపట్టారు. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న 420 హామీలను విస్మరించారని, పల్లెల్లో పారిశుధ్యం పడకేసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని నాయకులు మండిపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాసాని నాగ శేషా పద్మ, చంద్రమోహన్, డా. ఉదయ జ్యోతి – భూక్యా ప్రసాద్, సత్యవరపు సంపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

