కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసుల సుదీర్ఘ స్వప్నమైన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం (Bhadradri Kothagudem Airport) ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ప్రాథమిక పరిశీలన నిర్వహించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణుల బృందం ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటించనుంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామయ్య క్షేత్రంతో పాటు జిల్లాలోని పారిశ్రామిక, బొగ్గు గనుల రంగాలు, గిరిజ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విమానాశ్రయం ఎంతో కీలకమని భావించి ఈ దిశగా ప్రక్రియను వేగవంతం చేశారు.
ఈ విమానాశ్రయ సాధన కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టివిడవని విక్రమార్కుడిలా కృషి చేస్తున్నారు. జిల్లా అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అవసరాన్ని వివరిస్తూ అందజేసిన ఆయన విజ్ఞప్తికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. మంత్రి తుమ్మల కోరిక మేరకు తక్షణమే ప్రీ-ఫీజిబిలిటీ సర్వే నిర్వహించాల్సిందిగా కేంద్ర మంత్రి ఏఏఐ అధికారులను ఆదేశించడంతో ఈ పర్యటన ఖరారైంది.
పర్యటనలో భాగంగా ఏఏఐ నిపుణుల బృందం జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరపనుంది. ముఖ్యంగా సుజాతనగర్, దమ్మపేట, పెనగడప, చాపరాలపల్లితో పాటు సీతాంపేట, దుమ్ముగూడెం ప్రాంతాల్లోని ప్రతిపాదిత స్థలాల సాధ్యాసాధ్యాలను ఈ బృందం ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది. కేంద్ర బృందం రాక నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అదనపు కలెక్టర్, జిల్లా అటవీ శాఖాధికారి, ఆర్‌డీఓ, మైన్స్, సర్వే, నీటిపారుదల, రోడ్లు-భవనాలు, విద్యుత్ శాఖల అధికారులు ఈ బృందానికి పూర్తిస్థాయి సహకారం అందించాలని ఆదేశించారు. సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం, రెవెన్యూ మ్యాప్‌లు, భౌగోళిక నిరూపకాలు, రవాణా మార్గాల వివరాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఏఏఐ బృందం ఇచ్చే సాంకేతిక నివేదిక ఆధారంగానే స్థలం ఖరారై భూసేకరణ, నిర్మాణం వంటి తదుపరి ప్రక్రియలు ముమ్మరం కానున్నాయి.

