కలం, తెలంగాణ బ్యూరో: వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిరీక్షించకుండా చూడాలని, ధాన్యం విక్రయించిన వెంటనే సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026–27లో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సుమారు రూ.18,250 కోట్ల విలువతో కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. ఇందు కోసం 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటిలో 3,180 ఐకేపీ, 4,372 పీఏసీఎస్, 731 ఇతర కేంద్రాలు ఉన్నాయని వివరించారు. అక్టోబర్ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకటో తేదీని నాటికి అన్ని కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఏడు సన్న రకాలకు రూ.500 బోనస్
– కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం గ్రేడ్–ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 చెల్లించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు.
– బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048, కేఎన్‌ఎం–1638, జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ–సోనా, డబ్ల్యూజీఎల్–44, కేఎన్‌ఎం–7715 రకాల సన్న ధాన్యానికి అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్‌ను అధ్యయనం చేసిన తర్వాతే ఈ రకాలను ఎంపిక చేసినట్లు చెప్పారు.
– ఈ వానాకాలంలో 57.70 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, సుమారు 119.57 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో 45 లక్షల మెట్రిక్ టన్నుల సన్న, 20 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు వివరించారు.
16.25 కోట్ల గన్నీ సంచులు
నవంబర్, డిసెంబర్‌లో ధాన్యం రాక గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉన్నందున గోదాములు, గన్నీ సంచులు, రవాణా వాహనాలు, హమాలీలు, తూకం, నాణ్యత పరీక్ష పరికరాలను ముందుగానే సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సీజన్కు 16.25 కోట్ల గన్నీ సంచులు అవసరం కాగా, ప్రస్తుతం 3.50 కోట్ల సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మిగిలిన సంచుల సమీకరణను వేగవంతం చేయాలని సూచించారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ ట్రాకింగ్‌ను తప్పనిసరి చేయాలని, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా సరిహద్దుల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సంచాలకుడు శ్యామ్ ప్రసాద్, అదనపు సంచాలకుడు రోహిత్ సింగ్ పాల్గొన్నారు.

